: ఆ రెండు పార్టీల మధ్య ‘జల్లికట్టు’ పొత్తు కుదురుస్తుందా?


తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఎద్దును లొంగదీసుకునే జల్లి కట్టు క్రీడను ఇక్కడి ప్రజలు ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి ఆడుతుంటారు. రాష్ట్రంలో ఈ క్రీడకు సంబంధించిన పోటీలను నిషేధిస్తూ 2014, మే నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సర్కార్ రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసింది. వచ్చే సంక్రాంతి నాటికి తమిళనాడులో ఈ క్రీడను ఆడుకునేందుకు అనుమతి పొందేందుకు జయ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా ఆమె రాశారు. ఈ క్రీడను అనుమతించేందుకు ఒక బిల్లును లేదా ఆర్డినెన్స్ ను గానీ తీసుకురావాలని ఈ నెలలో రాసిన ఆ లేఖలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇటీవలే ముగిసినందున బిల్లును తీసుకొచ్చే అవకాశాలు ఎలాగూ లేవు. ఆ బిల్లును తీసుకురావాలంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలి. రాజ్యసభలో ప్రతిపక్షం కలిసిరావాలి. అలా జరిగే అవకాశాలు దరిదాపులో లేవు. ఇక ఆర్డినెన్స్ తీసుకరావడమే ప్రత్యామ్నాయ మార్గం. త్వరలోనే కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రి పి. రాధాకృష్ణన్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, జయ లేఖ వెనుక అసలు రాజకీయం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ కు అనుకూలంగా బీజేపీ సర్కార్ స్పందిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమేనన్న పరోక్ష సందేశాన్ని జయ సర్కార్ ఆ లేఖ ద్వారా పంపిందని అంటున్నారు.

  • Loading...

More Telugu News