: ఆసీస్ సిరీస్ లో నా సత్తా చాటుతా: యువరాజ్ సింగ్
ఫిట్ నెస్ కోసం తాను చాలా కష్టపడ్డానని, దాని ఫలితం తప్పకుండా వస్తుందని టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీస్ లో తన సత్తా చాటుతానని అన్నాడు. బీసీసీఐ టీవీతో యువరాజ్ మాట్లాడుతూ, టీమిండియాలోకి తిరిగి రావడంపై తనకు సంతోషంగా ఉందన్నాడు. క్రికెట్ ను ఆస్వాదించినంత కాలం తాను కొనసాగుతానని యువీ గతంలో చెప్పిన విషయాన్నే మరోసారి గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ ట్వంటీ 20 మ్యాచ్ లు తాను ఆడాలనుకుంటున్నానన్నారు. 2007లో ట్వంటీ 20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకున్న క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. గత ఏడాది ట్వంటీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో తన ఆటతీరు పరమ చెత్తగా ఉందని, అది తలచుకుని ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని యువీ అన్నాడు.