: స్వదేశీ పరిజ్ఞానంతో 'ఈ-ఆటో' రిక్షాల ఉత్పత్తి ప్రారంభం
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా ఈ-ఆటో రిక్షాల ఉత్పత్తిని 'ఓకే ప్లే ఇండియా' కంపెనీ ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడడమే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఈ ఆటోను రూపొందించారు. ఇప్పటివరకు చైనా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలతోనే ఈ-ఆటో రిక్షాలను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆట బొమ్మలను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన ఓకే ప్లే ఇండియా కొంతకాలం నుంచి ఆటో మొబైల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. తాజాగా ఈ-ఆటో రిక్షాల ఉత్పత్తిని మొదలుపెట్టింది. పరిశ్రమలో రెండు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి దాన్ని తయారు చేసినట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ హండా తెలిపారు. ఆటోరిక్షాకు అనుసంధానించే మోటారు బైక్ మినహా మిగతా బాడీ అంతా ప్లాస్టిక్ తోనే తయారు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సామాగ్రిని పెట్టుకోవడానికి, డ్రైవర్ కూడా తనకు అవసరమైన సామాగ్రిని అమర్చుకునేందుకు వీలుగా ఆటో బాడీని తీర్చిదిద్దామని వివరించారు. హర్యానాలోని సొహ్నా వద్ద, తమిళనాడులోని రాణిపేట్ లో ఏర్పాటు చేసిన తమ ప్లాంటులకు ఏడాదికి మూడు లక్షల ఆటోరిక్షాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఒక్కసారి బ్యాటరీ చార్జిచేస్తే ఈ ఆటోలు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముందుకు, వెనక్కి వెళ్లేందుకు వీలుగా స్విచ్ లు ఏర్పాటు చేశారు. లక్ష 15వేల నుంచి లక్షా 25వేల మధ్య లభించే ఈ రిక్షాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు ఐసీఏటీ ఆమోదం కూడా పొందింది. ఈ రిక్షాలకు కంపెనీ 'ఇ-రాజా' అని పేరు పెట్టింది.