: మళ్లీ యాక్టివేట్ అయిన హరీశ్!.... చండీయాగంలో అంతా తానై వ్యవహరిస్తున్న వైనం
టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు మళ్లీ యాక్టివేట్ అయ్యారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత కేసీఆర్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా కేసీఆర్ వెన్నంటి నడవడంతో పాటు కేసీఆర్ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడమే కాక ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరుగాంచిన హరీశ్ రావుకు తెలంగాణ తొలి కేబినెట్ లో మంచి శాఖే దక్కింది. అయితే కాలక్రమేణా హరీశ్ రావు ప్రాధాన్యం తగ్గినట్లుగా అనిపించింది. ఇటీవలి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవాల్సిన హరీశ్ రావు, వెనుక బెంచీలకు పరిమితమయ్యారు. కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. ఇక మొన్నటి వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో హరీశ్ రావును సింగిల్ అసెంబ్లీకి ఇన్ చార్జీగా నియమించిన కేసీఆర్, ఆయనను అవమానించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. మరింత కాలం పోతే హరీశ్ ప్రాధాన్యం బాగా తగ్గిపోతుందని, ఆ స్థానం కేటీఆర్ తో భర్తీ అవుతుందన్న వాదనలూ వినిపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ తన మేనమామ చేపట్టిన అయుత చండీయాగం సందర్భంగా హరీశ్ రావు మళ్లీ యాక్టివేట్ అయ్యారు. ఈ నెల 23న ప్రారంభమైన యాగానికి సంబంధించి హరీశ్ రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నిత్యం యాగక్షేత్రంలోనే ఉంటున్న ఆయన యాగానికి తరలివస్తున్న ప్రముఖులను ఆహ్వానిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. అంటే, మళ్లీ పాత హరీశ్ రావు రంగంలోకి దిగేశారన్నమాట.