: ఘోరం... భారత విద్యార్థులను అబూదాబీ ఎయిర్ పోర్టు గదుల్లో బంధించిన అమెరికా అధికారులు
ఉన్నత విద్యను అభ్యసించాలన్న కోరికతో అమెరికా వెళ్లాలన్న భారత విద్యార్థుల కోరిక మధ్యలోనే ఆగిపోయింది. ఇండియా నుంచి బయలుదేరిన వీరంతా, రెండు కాలిఫోర్నియా యూనివర్శిటీలకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్లు పొంది వీసాలను తీసుకోగా, మార్గమధ్యంలో అబూదాబీలో దిగాల్సి వచ్చింది. అక్కడ యూఎస్ ప్రీ క్లియరెన్స్ అధికారులు చుట్టూ ఎవరున్నారన్నది కూడా చూడకుండా వారితో హేళనగా మాట్లాడుతూ, నేరస్తులను బంధించినట్టు గదిలో పెట్టి తలుపులు వేశారు. అంతకుముందు వీరిని అడ్డదిడ్డమైన ప్రశ్నలతో వేధించారని విద్యార్థులు చెబుతున్నారు. గత 24 గంటల్లో మద్యం సేవించావా? తాగితే ఎంత తాగావు? నువ్వొచ్చిన విమానంలో ఎయర్ హోస్టెస్ ఏం ధరించింది? ఆమె బాగుందా? ఆమె జుట్టు రంగు ఎలా ఉంది? వంటి ప్రశ్నలను యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు అడిగారు. దాదాపు 16 గంటల పాటు గదిలో బంధించిన అధికారులు, వీరి వీసాలను రద్దు చేసి తిరిగి హైదరాబాద్ కు వెళ్లే విమానాన్ని ఎక్కించారు. మొత్తం 16 మందికి ఇలా జరిగింది. తమకు అమెరికన్ వర్శిటీల్లో ప్రవేశాన్ని పొందడం ఇష్టం లేదని, వీసాలు రద్దు చేయాలని రాసున్న కాగితాలపై వీరి సంతకాలను బలవంతంగా తీసుకున్నారని విద్యార్థులు ఆరోపించారు. వీసాలను ఎందుకు రద్దు చేశారన్నది తమకు తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాగా, ఒకసారి అమెరికా వీసా పొంది అది రద్దయితే, ఇక భవిష్యత్తులో ఎప్పుడూ వీసా రాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వీసా ఉన్నప్పటికీ, ఇమిగ్రేషన్ అధికారులకు సరైన సమాధానం చెప్పడంలో విఫలమైతే, వారి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వుంటుంది. తాము అమెరికాకు ఎందుకు వెళ్తున్నామన్న విషయాన్ని ఎయిర్ పోర్టులో అధికారులకు సవివరంగా చెప్పాల్సి వుంటుందని పేర్కొంది.