: ఐరన్ మ్యాన్, అవెంజర్స్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ కు క్షమాభిక్ష
మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్న హాలీవుడ్ నటుడు, ఆస్కార్ నామినీ రాబర్ట్ డౌనీ జూనియర్ కు కాలిఫోర్నియా గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 91 మందికి క్షమాభిక్ష పెట్టినట్టు తెలిసింది. వీరిని క్షమించినంత మాత్రాన, చేసిన తప్పులను రికార్డుల నుంచి తొలగించినట్టు కాదని, వీరిని ఓ కంట కనిపెడుతుంటామని, వీరి ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని నమ్మినందునే క్రిస్మస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ జెర్రీ బ్రౌన్ కార్యాలయం వెల్లడించింది. పూర్తిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన హాలీవుడ్ నటుల్లో పునరావాస ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్న అద్భుతమైన సక్సెస్ స్టోరీ రాబర్ట్ డౌనీదని సినీ పండితులు వ్యాఖ్యానించారు. కాగా, 2008 నుంచి ఐరన్ మ్యాన్, అవెంజర్స్ సిరీస్ చిత్రాల్లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. 2002లో చాప్లిన్ చిత్రానికి, ఆపై 2008లో ట్రాపిక్ థండర్ చిత్రానికి ఆస్కార్ నామినీగా ఎంపికైనప్పటికీ, విజేతగా మాత్రం నిలువలేకపోయారు. 1996లో ఆయన పసిఫిక్ కోస్ట్ హైవేపై కారులో వెళుతూ, ఓ పిస్టల్, కొకైన్, హెరాయిన్ లతో పట్టుబడ్డప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 1999లో ఓ సంవత్సరం పాటు ఆయన జైల్లో కూడా గడిపారు.