: మోదీ... ఆల్ టైమ్ ఆన్ డ్యూటీ!: సింగిల్ డే లీవు తీసుకోని భారత ప్రధాని
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రచారం హోరెత్తింది. అన్ని పార్టీలకు భిన్నంగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ‘కమల’ దళం వినూత్న రీతిలో ప్రచారాన్ని సాగించింది. తనపై నమ్మకముంచి అధికారం కట్టబెడితే విరామం ఎరుగని రీతిలో పనిచేస్తానని మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన మాటను జనం నమ్మారు. ఓట్లేశారు. అఖండ మెజారిటీలో ఆయన గెలిచారు. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ సుస్థిర ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని పదవిలో సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ఆసీనులయ్యారు. జనానికి ఇచ్చిన మాటను మోదీ గుర్తు పెట్టుకున్నారు. సింగిల్ డే కూడా లీవు తీసుకోకుండా ఆయన పనిచేసుకుపోతున్నారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి ప్రధాని ఒక్క రోజు కూడా లీవు తీసుకోలేదట. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్ కు ప్రధానమంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) సమాధానం ఇచ్చింది. ఇక సెలవు తీసుకోని ప్రధాని డ్యూటీ టైమింగ్స్ ఏమిటన్న ప్రశ్నకు కూడా పీఎంఓ విస్పష్ట సమాధానం ఇచ్చింది. ‘పీఎం ఆల్ టైమ్ ఆన్ డ్యూటీ’’ అంటూ 24 గంటలూ ప్రధాని విధి నిర్వహణలోనే ఉంటారని కూడా తేల్చిచెప్పింది.