: తన ప్రత్యేక అభిమానిని కలిసిన అమీర్ ఖాన్
తన ప్రత్యేక అభిమాని నిహాల్ బిట్లాను బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కలిశాడు. 14 ఏళ్ల వయసున్న నిహాల్ అత్యంత అరుదైన జన్యు సంబంధిత ప్రొజీరియా వ్యాధితో (బాల్యంలోనే వృద్ధాప్యపు ఛాయలు కనిపించే వ్యాధి) బాధపడుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన 'తారే జమీన్ పర్' సినిమాను తీసిన అమీర్ ఖాన్ ను కలిసి, అభినందనలు తెలపాలని నిహాల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అతని మనోగతాన్ని 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ప్రముఖ ఫేస్ బుక్ గ్రూప్ తన పోస్టు ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అమీర్ ఖాన్ తన అభిమానిని కలవడమే కాకుండా... తారే జమీన్ పర్ సినిమా డీవీడీని, ఒక బోర్డ్ గేమ్ ను, తన ధూమ్-3 బొమ్మను క్రిస్మన్ బహుమతులుగా అందించాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ, నిహాల్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.