: ఢిల్లీ బాటలో బీహార్... డీజిల్ వాహనాలపై నిషేధం
ఢిల్లీ ప్రభుత్వ బాటలోనే బీహార్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ వాహనాలను నిషేధించాలని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పాట్నాలో 15 ఏళ్ల సర్వీసు నిండిన వాహనాలను అనుమతించబోమని తెలిపారు. రాజధానిలో పెరుగుతోన్న కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నితీశ్ వెల్లడించారు. ఈ మేరకు పర్యావరణం, అటవీ శాఖపై సీఎం అధ్యక్షతన ఇవాళ పాట్నాలో సమీక్షా సమావేశం జరిగింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతేగాక ప్లాస్టిక్, ఘన వ్యర్థాలను తగలబెట్టే విషయంపై కూడా నియంత్రణ విధించాలని నితీశ్ చెప్పారు.