: మేమంతా దగ్గుతున్నామండీ... అందుకే, కష్టమైనా కొత్త రూల్ పాటించాల్సిందే: కేజ్రీవాల్
దేశ రాజధానిలో జనవరి 1 నుంచి సరి, బేసి సంఖ్యల విధానాన్ని ప్రజలంతా పాటించాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. "మేమంతా నిత్యమూ దగ్గుతున్నాం. అందుకే, కాలుష్య నియంత్రణకు సంబంధించి తీసుకున్న నిర్ణయం కొంత కఠినమైనదైనా అది మీ కోసం, మీ పిల్లల కోసం పాటించక తప్పదు" అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాను, తన కుటుంబం కూడా ఈ విధానాన్ని పాటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో ఉండే వీవీఐపీలకు మాత్రమే నిబంధనల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ బృహత్కార్యం వెనక ఉద్దేశాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఓ బెత్తం తీసుకుని నిర్ణయాన్ని అమలు చేయాలని తాము కోరుకోవడం లేదని, స్వచ్ఛందంగా ప్రజలు పాటించాలని, ఈ విధానం శాశ్వతంగా మాత్రం ఉండబోదని తెలిపారు.