: సౌదీ ఆసుపత్రిలో పెను అగ్ని ప్రమాదం... 25 మంది మృతి
సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేటి తెల్లవారుఝామున జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, సౌత్ సౌదీలోని జజాన్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ లో మంటలు చెలరేగి, ఆపై మెటర్నిటీ వార్డుకు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనం కాగా, ఒంటినిండా మంటలతో రోగులు బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చామని, ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.