: నా సస్పెన్షన్ కు కారణాలేంటో మోదీ సమాధానం ఇవ్వాలి: ఎంపీ కీర్తీ ఆజాద్
బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తూ తనకు నోటీసులివ్వడంపై ఆ పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ తీవ్రంగా స్పందించారు. నిజాలు చెప్పడమే తాను చేసిన నేరమా? అని ప్రశ్నించారు. అదే గనుక తప్పైతే ఎప్పటికీ నేరాలు చేస్తూనే ఉంటానన్నారు. పార్టీపై తానెప్పుడూ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని, కేవలం అవినీతిపై మాత్రమే నోరు విప్పానని ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరించారు. గతంలో కూడా బీసీసీఐకి సంబంధించిన అవినీతిపై తాను ప్రశ్నలు లేవనెత్తానని గుర్తు చేశారు. అదేవిధంగా 'ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్' (డీడీసీఏ)లో జరిగిన అక్రమాల గురించి గత తొమ్మిది సంవత్సరాలుగా తాను చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక తనకు పంపిన నోటీసులు అందాయని, త్వరలోనే వాటికి సమాధానం ఇస్తానని చెప్పారు. అయితే తన సస్పెన్షన్ కు గల కారణాలేంటో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం ఇవ్వాలని ఆజాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సహాయాన్ని తీసుకుంటానని తెలిపారు.