: చెరకు రైతులకు చేదు వార్త... నిజాం షుగర్స్ కు లేఆఫ్ ప్రకటించిన యాజమాన్యం


కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెరకు రైతులకు తీపి వార్త చెబుతారనుకుంటే, నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) చేదు వార్తను ప్రకటించింది. మెదక్ జిల్లా మంబోజిపల్లి, నిజామాబాద్ జిల్లా శక్కర్ నగర్, కరీంనగర్ జిల్లా మెట్ పల్లి పరిధిలోని తన చక్కెెర కర్మాగారాలకు లేఆఫ్ ప్రకటిస్తూ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. ఇప్పటికే ఈ కర్మాగారాల పరిధిలోని రైతులు పండించిన చెరకును ప్రభుత్వం ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తోంది. దీనిపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే రైతుల శ్రేయస్సు దృష్ట్యానే చెరకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా చెబుతూ వచ్చారు. ఈ వ్యవహారంపై రైతులు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే ఎన్డీఎస్ఎల్ లేఆఫ్ ప్రకటిస్తూ వారికి మరో షాకిచ్చింది. లేఆఫ్ కు ఎన్డీఎస్ఎల్ చెబుతున్న కారణాలు కూడా అసంబద్ధంగానే ఉన్నాయి. ఓ వైపు ఈ కర్మాగారాల పరిధిలోని చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తోంటే, ఎన్డీఎస్ఎల్ మాత్రం చెరకు కొరత కారణంగానే లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు నిన్న కర్మాగారాల వద్ద అంటించిన నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. లేఆఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ఉద్యోగులు నిన్ననే ఆయా ఫ్యాక్టరీల ముందు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News