: చోటా రాజన్ హత్యకు దావూద్ పక్కా ప్లాన్!... బాలిలో ‘జర్నలిస్టు జంట’ వేషంతో వేసిన ప్లాన్ ఫ్లాప్!


మాఫియా డాన్ చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు అతడి ప్రత్యర్థి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పక్కా ప్లాన్ వేశాడు. అయితే ఆ ప్లాన్ కొద్దిలో తప్పిపోవడంతో చోటా రాజన్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించి దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ సదరు ప్లాన్ ను పూసగుచ్చినట్లు వివరించాడు. ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా చోటా షకీల్ ఈ వివరాలు వెల్లడించాడు. చోటా రాజన్ ను లాకప్ లోనే చంపేస్తారా? అన్న ఓ ప్రశ్నకు ఫోన్ లో వేగంగా స్పందించిన షకీల్... రాజన్ చంపేసేందుకు ఇండోనేసియా నగరం బాలిలోనే పక్కాగా ప్లాన్ వేశామని చెప్పాడు. కొంతమేర సమాచారం రాని నేపథ్యంలోనే తమ ప్లాన్ విఫలమైందని అతడు పేర్కొన్నాడు. ఈ కారణంగానే రాజన్ బతికి బయటపడ్డడనీ, అయితే ఇండియాలోనే అతడిని అంతం చేస్తామని ప్రకటించాడు. బాలిలో అరెస్ట్ తర్వాత చోటా రాజన్ పలుమార్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ క్రమంలో ఓ పురుషుడితో పాటు మహిళను విలేకర్ల అవతారంలో రంగంలోకి దించామని షకీల్ చెప్పాడు. సదరు నకిలీ విలేకర్లకు ఐడీ కార్డులతో పాటు కెమెరాలు కూడా అందించామన్నాడు. విలేకర్ల రూపంలో రాజన్ వద్దకు వెళ్లిన తర్వాత మహిళ రాజన్ పై కాల్పులు జరపాలన్నది తమ ప్లాన్ గా పేర్కొన్నాడు. అయితే అంతమంది దగ్గరగా ఉన్న సమయంలో ఆయుధం తీసి అతన్ని కాల్చడం అన్నది వీలుపడలేదని, దాంతో అప్పటికి రాజన్ బతికిపోయాడని షకీల్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News