: ‘వర్మ’కు ‘మ్యాగీ’ గిఫ్ట్ హ్యాంపర్!
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మ్యాగీ నూడిల్స్ సంస్థ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ను పంపించనుంది. అందుకోసం, అడ్రసు వివరాలను పంపాలంటూ వర్మను ‘మ్యాగీ’ సంస్థ కోరింది. వర్మపై ‘మ్యాగీ’కి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందనేగా మీ ప్రశ్న? దీని వెనుక కథేమిటంటే... ‘మ్యాగీ’ నిషేధానికి గురైన కాలంలో దానికి బాసటగా వర్మ నిలిచారు. దానిపై ప్రేమ కురిపించడమే కాకుండా మద్దతుగా కూడా ప్రకటించారు. తనదైన శైలిలో వర్మ సామాజిక మాధ్యమాల్లో మ్యాగీ గురించి గొప్పగా చెప్పారు. ఇదంతా గమనిస్తున్న ‘మ్యాగీ’ అందుకు పొంగిపోయింది. గిఫ్ట్ హ్యాంపర్ ను పంపిస్తామంటూ వర్మకు తెలిపింది. ఇది తనకు అరుదైన గౌరవంగా భావించిన వర్మ, అందుకు స్పందిస్తూ ‘మ్యాగీ బేబి, నువ్వు ఇప్పటికే 20 లక్షల ఆనందాన్ని కానుకగా ఇచ్చావు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వర్మ-మ్యాగీ ట్విట్టర్ సంభాషణకు స్పందించిన ఒక అభిమాని... బాలీవుడ్ నటుడు షారూక్, హీరోయిన్ కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా కంటే మీ ప్రేమ కథ బాగుందంటూ ట్వీట్ చేశాడు. ఆ అభిమాని ట్వీట్ కూడా నచ్చడంతో దానికి వర్మ రీట్వీట్ చేసి తన సంతోషం వ్యక్తం చేశాడు.