: ‘సౌదీ’ యజమాని చేతిలో చావు దెబ్బలు తిన్న ముగ్గురు భారతీయులు!


సౌదీ అరేబియాలో పని చేస్తున్న భారత్ కు చెందిన ముగ్గురు కార్మికులపై యజమాని పైశాచికంగా ప్రవర్తించాడు. ముగ్గురు కార్మికుల వెంటబడి తన ఇష్టానుసారంగా యజమాని కర్రతో బాదుతున్న సంఘటన ఒకటి వీడియోలో రికార్డయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... కేరళలోని హరిపాద్ టౌన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులకు యెమెన్ లో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలిప్పిస్తామంటూ ఒక దళారి నమ్మబలికాడు. దీంతో వారు ముగ్గురు అక్కడికి వెళ్లారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయామన్న సంగతి వారికి తెలిసింది. ఎలక్ట్రికల్ పనులకు బదులుగా సౌదీ అరేబియా అభాలోని ఇటుక రాళ్ల బట్టీలో ముగ్గురిని బలవంతంగా కార్మికులుగా చేర్చారు. గత్యంతరం లేకపోవడంతో ఇటుక పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురు కార్మికులను ఇటుక రాళ్ల బట్టీ యజమాని కర్రతో బాదాడు. ఈ సంఘటనను మిగతా కార్మికులు వీడియోలో చిత్రీకరించగా, దానిని వీరు తీసుకుని తమ కుటుంబసభ్యులకు పంపారు. తమను ఈ నరక కూపం నుంచి బయటపడేలా చూడాలని వారు కోరారు. ఈ వీడియో కేరళ ప్రభుత్వానికి చేరడం, తద్వారా ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పందించటం జరిగింది. ఈ విషయమై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో ఇక్కడి ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాకుండా, సౌదీ అరేబియాలో ఉన్న కేరళ వాసుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అక్కడ చిక్కుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్న వారిని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News