: ఆడపిల్ల వద్దనుకునే వారు నాకివ్వండి.. పెంచుతాను: హాస్య నటుడు వేణుమాధవ్


‘ఆడపిల్లలను సంరక్షించాలంటూ’ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలో బుధవారం ఒక ర్యాలీ నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఆడపిల్లలను సంరక్షించాలంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రత్యేక అతిథిగా సినీ హాస్యనటుడు వేణుమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తల్లి, చెల్లెలు, భార్య.. ఆడవాళ్లే. మనమందరం వాళ్లను గౌరవించుకోవాలి. ఆడపిల్లంటే దేవతలు. మరి, అలాంటి ఆడపిల్లల పట్ల చిన్న చూపు తగదు. తమకు పుట్టబోయే బిడ్డ ఆడ అని తెలుసుకుని.. కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటి పనులు ఎవ్వరూ చేయకూడదు. బిడ్డ పుట్టిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి.. తమకు వద్దనుకునే వారు నాకు ఇవ్వండి. ఎంతమందినైనా సరే, నేను సాకుతాను’ అంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులను వేణుమాధవ్ అభినందించారు.

  • Loading...

More Telugu News