: క్రీడల నిర్వహణ ఇక క్రీడాకారులకే!... డీడీసీఏ వివాదం నేపథ్యంలో కేజ్రీ ట్వీట్స్


ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద రభసే నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ అవకతవకల్లో ప్రత్యక్ష ప్రమేయముందన్న వాదనా వినిపిస్తోంది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో సీబీఐ సోదాలతో ఒక్కసారిగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాక మరోమారు ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధానికే తెరలేపింది. డీడీసీఏ అక్రమాలకు సంబంధించి అరుణ్ జైట్లీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జైట్లీ, కేజ్రీపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మరోవైపు డీడీసీఏ అక్రమాలకు సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిన కేజ్రీ సర్కారు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నేటి ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇకపై క్రీడల నిర్వహణను ఆయా క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన మేటి క్రీడాకారులకే అప్పజెబుదామని పిలుపునిచ్చారు. అంతేకాక ఇకపై క్రీడల నిర్వహణను ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అప్పగించరాదని కూడా ఆయన కోరారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News