: కేసీఆర్ యాగానికి రూ.7 కోట్ల ఖర్చు... రైతులు ఆక్రోశిస్తున్నారంటూ నేషనల్ మీడియా కథనాలు
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి ఉదయం ప్రారంభించిన అయుత మహా చండీయాగంపై నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న యాగానికి కేసీఆర్ రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. అంతేకాక ఈ నిధుల్లో సర్కారు నిధులు సింగిల్ పైసా కూడా లేదని కేసీఆర్ ప్రకటించిన అంశం కూడా ఆ కథనాల్లో ప్రధానంగా చోటుచేసుకుంది. తన సొంత నిధులతో పాటు మిత్రులు, శ్రేయోభిలాషులు అందించిన నిధులతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయ ప్రస్తావన కూడా వాటిలో కనిపించింది. ఇక కేసీఆర్ యాగంపై తెలంగాణ రైతులు ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న కొత్త విషయాన్ని ఆ కథనాలు ఆసక్తికరంగా ప్రస్తావించాయి. యాగ క్షేత్రానికి కేవలం 10 కిలో మీటర్ల దూరంలోని పీర్లపల్లికి చెందిన రైతు నల్లా కిష్టయ్య అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కిష్ణయ్య కొడుకు రాజు తన విద్యాభ్యాసాన్ని నిలిపివేశాడు. 'ఏ అండా లేని మాలాంటి వాళ్లను ముఖ్యమంత్రి ఆదుకోవాలి. లేకపోతే పిల్లలని ఎలా చదివించుకోగలను?' అంటూ కిష్టయ్య భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనాన్ని కూడా ఆ కథనాలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి.