: బస్సు నడిపిన కోతి...బెంబేలెత్తిన డ్రైవర్
స్టీరింగ్ తీసుకుని బస్సును నడిపిన ఓ కోతి ఆర్టీసీ డ్రైవర్ ను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళ్తే...ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ కు చెందిన యూపీఎస్ఆర్టీసీ బస్సు బయల్దేరేందుకు అర గంట సమయం ఉండడంతో డ్రైవర్ ఓ చిన్న కునుకు తీసేందుకు వెనుక సీట్లోకి మారి నిద్రకు ఉపక్రమించాడు. కండక్టర్ బయట నిలబడి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంఛో వచ్చిన ఓ కోతి...నేరుగా డ్రైవర్ సీట్లో కూర్చుని, ఇగ్నీషన్ 'కీ' తిప్పింది. తాళం దానికే ఉండడంతో బస్సు స్టార్ట్ అయిపోయింది. ఆ సౌండుకి మేల్కొన్న డ్రైవర్ తన కేబిన్ లోకి పరుగెత్తి కోతిని వెళ్లగొట్టాడు. ఒక్కసారిగా బస్సు స్టార్ట్ కావడంతో షాక్ తిన్న కోతి బిక్కచచ్చిపోయింది. డ్రైవర్ దానిని తరమడంతో అది పొరపాటున గేర్ రాడ్ కు తగిలింది. దీంతో అప్పటికే స్టార్ట్ అయి ఉన్న బస్సు రెండో గేర్ లోకి మారి ముందుకు కదిలిపోయింది. వెంటనే డ్రైవర్ బస్సును నియంత్రించారు. అయితే అప్పటికే ఆ బస్సు ఎదురుగా నిలిపి ఉన్న రెండు బస్సులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. బస్సులు స్వల్పంగా డామేజ్ అయినట్టు తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ, కోతుల బెడద తప్పడం లేదని వాపోయారు. వర్క్ షాపులోకి చొరబడి, మరమ్మతులు చేస్తున్న బస్సుల పెడల్స్ ఒత్తడం, ఇగ్నీషన్ స్టార్ట్ చెయ్యడం, ఇతర వస్తువులతో ఆడుకోవడం చేస్తుంటాయని అధికారులు తెలిపారు. కొంత కాలం క్రితం సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాయని వారు పేర్కొన్నారు. కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టినా మళ్లీ మళ్లీ వస్తూ ఇబ్బంది పెడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.