: ప్రైవేట్ ట్రావెల్స్ పై తెలంగాణ ఆర్టీఏ కొరడా... 50 బస్సులపై కేసులు నమోదు
సర్కారీ నిబంధనలు అతిక్రమిస్తూ తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. హైదరాబాదు నుంచి వివిధ ప్రాంతాలకు దారి తీసే అన్ని ప్రధాన రహదారులపై ప్రత్యక్షమైన ఆర్టీఏ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, శివరాంపల్లి చౌరస్తా (అరాంఘర్ చౌరస్తా)ల్లో ఆర్టీఏ జేటీసీ రఘునాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సోదాల్లో ఇప్పటిదాకా 50 బస్సులపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నందునే ఈ బస్సులపై కేసులు నమోదు చేశామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.