: బాల నేరస్థుల న్యాయ చట్ట సవరణ బిల్లు ఆమోదం
బాల నేరస్థుల న్యాయ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం తీవ్ర నేరాలకు పాల్పడ్డ నేరస్థుల విషయంలో 18 ఏళ్లను బాల నేరస్థులుగా పరిగణించ కూడదని, ప్రత్యేక కేసుల్లో 16 ఏళ్ల వరకు మాత్రమే బాల నేరస్థులు అని పేర్కొనాలనే చట్టసవరణను లోక్ సభ గతంలోనే ఆమోదించగా, రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది. రాజ్యసభ గ్యాలరీలో నిర్భయ తల్లిదండ్రులు వీక్షిస్తుండగా ఎంపీలు ఈ బిల్లును ఆమోదించడం విశేషం. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా, దేశంలో చోటుచేసుకున్న ఒక సంఘటనను చూపించి చట్ట సవరణ చేయడం సరికాదని, అలా చట్టసవరణలు చేస్తూ పోతే ఎన్నో బిల్లులకు సవరణలు కోరుతారని, పూర్తిగా స్టడీ చేసిన తరువాతే బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని, అందుకే ఈ బిల్లును తిప్పిపంపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లుపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అనుమతించడంతో వామపక్ష పార్టీలు, సమాజ్ వాదీ పార్టీ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం జరిగిన చర్చలో పలు సూచనలు, సలహాలతో బాల నేరస్థుల న్యాయ చట్ట సవరణ బిల్లులో వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదిస్తూ చట్టం చేశారు.