: దుబాయ్ యువతిని కిడ్నాప్ చేసిన 'డెల్' సాఫ్ట్ వేర్ ఉద్యోగి
హైదరాబాదులో దారుణం జరిగింది. దుబాయ్ కి చెందిన ఓ యువతిని డెల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తనను పెళ్లి చేసుకోవాలంటూ గత ఐదు రోజుల నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. కిడ్నాప్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పేరు సయ్యద్ ఇమాద్. ఏడాది క్రితం వరకు ఆ యువతి కూడా డెల్ కంపెనీలోనే పని చేసింది. అనంతరం దుబాయ్ వెళ్లిపోయింది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న ఇమాద్ దుబాయ్ వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చాడు. టోలిచౌకిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెను నిర్బంధించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. కత్తి, పెట్రోల్ చూపిస్తూ, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయింది. అయితే, చివరకు ఈ ఉదంతాన్ని తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అతను వెంటనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన షీటీమ్ ఇమాద్ ను అదుపులోకి తీసుకుంది. బాధితురాలి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. ఇమాద్ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు.