: రాజ్యసభ గ్యాలరీలో నిర్భయ పేరెంట్స్... జువెనైల్ బిల్లుపై చర్చను పరిశీలించనున్న వైనం
16 సంవత్సరాలకు పైబడిన బాలలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన సందర్భాలలో వారిని కూడా మేజర్లుగా పరిగణించి విచారించే విధంగా జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణపై నేడు రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరగనుంది. ఈ చర్చను బాధితురాలు నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీ సింగ్ పాండేలు కూడా ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ మేరకు వారిద్దరూ రాజ్యసభ వీక్షకుల గ్యాలరీకి చేరుకున్నారు. సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ను నిన్న కలిసిన వారు బాల నేరస్తుడన్న పేరిట నిర్భయ నిందితుడిని విడుదల చేయడం సరికాదని, నేటి చర్చలో చట్టానికి సవరణ జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేటి సభలో జరగనున్న చర్చలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తన వాదనను వినిపించనుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.