: ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని టార్గెట్ చేసిన కేజ్రీవాల్, జెఠ్మలానీ
ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని టార్గెట్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ. వీరిద్దరి కామన్ టార్గెట్ అరుణ్ జైట్లీ కావడం విశేషం. మాజీ బీజేపీ నేత అయిన రాంజెఠ్మలానీకి పార్టీలోను, వృత్తిలోనూ అరుణ్ జైట్లీ ప్రత్యర్థిగా ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అరుణ్ జైట్లీ 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. దీంతో జైట్లీకి చెక్ పెట్టాలని భావించిన కేజ్రీవాల్, జెఠ్మలానీని రంగంలోకి దించారు. తన తరపున కేసు వాదించాలని జెఠ్మలానీని కేజ్రీవాల్ కోరారు. జైట్లీపై కేసు కావడంతో ఆయన కూడా సై అనేశారు. కేజ్రీవాల్ కేసును వాదించడం ద్వారా రాజకీయంగా బలపడవచ్చని, అలాగే తన చిరకాల ప్రత్యర్థి అయిన జైట్లీని దెబ్బకొట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. జెఠ్మలానీని న్యాయవాదిగా పెట్టుకోవడం ద్వారా తనకు కూడా సరైన న్యాయవాదులు ఉన్నారని పరోక్షంగా బీజేపీకి చాటి చెప్పడం, జైట్లీకి చెక్ చెప్పడం ద్వారా బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయడం కేజ్రీవాల్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా, తాను తప్పు చేయలేదని, తనపై ఆరోపణలు నిలబడవని జైట్లీ ధైర్యంగా ఉన్నారు.