: మంత్రి కేటీఆర్ వివరణపై ఈసీ అసంతృప్తి!
మంత్రి కేటీఆర్ పై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆయన ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం(ఈసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఈసీ పలు సూచనలు చేసింది. భవిష్యత్ లో ఇటువంటి వాటికి పాల్పడవద్దంటూ, అధికారిక హోదాను పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించటం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని ఈసీ పేర్కొంది. భవిష్యత్ లో ఇలాంటి ఫిర్యాదులకు అవకాశమివ్వద్దని కేటీఆర్ కు ఈసీ సూచించింది. కాగా, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఇతర పార్టీల నేతలని తెరాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ప్రతిపక్షాల నుండి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. మరమ్మతుల అంశంపై ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తనను కలిశారన్న కేటీఆర్ వివరణతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.