: ఆ ముగ్గురు యువకులు ఐఎస్ఐఎస్ లో చేరారా?
ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఐఎస్ఐఎస్ లో చేరినట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ముంబైలోని మాల్వానీ ప్రాంతానికి చెందిన ఆయాజ్ సుల్తాన్ (23), మోసిన్ షేక్ (26), వాజిద్ షేక్ (25) ఐఎస్ఐఎస్ లో చేరినట్టు అనుమానిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని శారు వెల్లడించారు. వీరు తప్పిపోయినట్టు పోలీస్ స్టేషన్ లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అతివాద భావజాలం ఈ ముగ్గురిని ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ప్రోత్సహించిందని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో సుల్తాన్ అక్టోబర్ 30 నుంచి అదృశ్యం కాగా, మిగిలిన ఇద్దరూ ఈ నెల 16 నుంచి కనిపించకుండా పోయారని వారు తెలిపారు. కువైట్ కు చెందిన సంస్థ నుంచి ఉద్యోగావకాశం వచ్చిందని, ఇంటర్వ్యూకి పూణే వెళ్తున్నానని సుల్తాన్ చెప్పగా, స్నేహితుడి వివాహానికి వెళ్తున్నానని మోసిన్, ఆధార్ కార్డులో పేరు సరి చేసుకునేందుకు వెళ్తున్నానని వాజిద్ ఇంట్లో చెప్పి అదృశ్యమయ్యారు. ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) వీరి మెయిల్ వివరాలు సంపాదించి దర్యాప్తు చేస్తోంది.