: 15 దేశాల ప్రతినిధులను కదిలించిన నదియా
ఇరాక్ కు చెందిన నదియా మురాద్ బాసీ తహా అనే 21 ఏళ్ల అమ్మాయి, తమ దేశంలో జరిగిన ఓ ఘోరమైన సంఘటనను వివరించి 15 దేశాల ప్రతినిధులను కదిలించింది. ఐక్యరాజ్యసమితి సాక్షిగా ఇరాక్ లోని పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించింది. ఇరాక్ లోని మూరుమూల ప్రాంతానికి చెందిన యాజాదీ తెగకు చెందిన గ్రామంలోకి చొరబడ్డ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 150 మంది మహిళలు, పిల్లలను బస్సులో ఎక్కించి మోసూల్ పట్టణానికి తీసుకెళ్లారు. వారిలో నదియా కూడా వుంది. మోసూల్ పట్టణంలో ఐఎస్ఐఎస్ అధీనంలోని ఓ భవనంలోకి వారిని తీసుకెళ్లారు. అక్కడ తమలాంటి చాలా మంది బాధితులు ఉన్నారని ఆమె చెప్పింది. అక్కడ ఐఎస్ఐఎస్ కు చెందిన పురుషులు యాజాదీ మహిళలను, పిల్లలను ఎంచుకుంటున్నారు. అది తనకేమీ అర్థం కాలేదని, దానిని అర్థం చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదని నదియా వెల్లడించింది. జరుగుతున్న తతంగం చూస్తూ నించున్న తన ముందు ఓ భారీకాయుడు వచ్చి నిలబడ్డాడని గుర్తు చేసుకుంది. అతను తనను తెగ హింసించాడని తెలిపింది. తిట్లతో హింసను ఆరంభించిన ఆ వ్యక్తి తరువాత తీవ్రంగా కొట్టాడని, బలంగా తన్నాడని తెలిపింది. ఇంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడని, దీంతో అతని బారినుంచి తనను రక్షించమని అతనిని వేడుకున్నానని చెప్పింది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని, అప్పుడు ఎవరూ హింసించరని ఆ వ్యక్తి సూచించాడని, అయితే, మతం మారేందుకు తాను అంగీకరించకపోవడంతో, బట్టలిప్పమన్నాడని ఆమె గుర్తు చేసుకుంది. అతను తన శరీరంతో ఆడుకుని వదిలేయగానే ఇంకొకడు వచ్చాడని, వాడి తరువాత మరొకడు.... ఆ తరువాత ఇంకొకడు... ఇలా తాను స్పృహ కోల్పోయేంతవరకు తన దేహంతో ఆడుకున్నారని నదియా చెప్పింది. అలా మూడు నెలల పాటు రోజూ నరకం చూపారని నదియా ఆమె తెలిపింది. ఆమె అనుభవాలను ఐక్యరాజ్యసమితి సభలో విన్న 15 దేశాల ప్రతినిధులు విషణ్ణవదనులైపోయారు. ఆవేదనతో కుమిలిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది కూడా మానవహననం లాంటిదేనని అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ భూమి మీద బతికేందుకు వారికి ఏ విధమైన అర్హత లేదని పేర్కొన్నారు. వారి బారి నుంచి తప్పించుకుని వచ్చి ఈ దురాగతాలు వెల్లడించిన నదియాను అంతా అభినందించారు.