: చంద్రబాబు ఎవరినైనా కాల్ మనీ చేసుకోమన్నారా?: జేసీ
విపక్ష నేతలంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి కడుపు కొడుతున్నారంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. కాల్ మనీ అంటూ రోజూ గొడవ చేస్తూ, డబ్బులు అవసరమైన వారికి అప్పులు పుట్టకుండా చేస్తున్నారని అన్నారు. వడ్డీ వ్యాపారం అనేది ప్రతి ఊర్లో ఉందని... వైకాపా అధినేత జగన్ ఊర్లో లేదా? అని ప్రశ్నించారు. అయితే, వడ్డీ వ్యాపారం చేయడం తప్పుకాదని, ఎక్కువ వడ్డీ వసూలు చేయడమే తప్పని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడైనా కాల్ మనీ వ్యాపారం చేసుకోమని ఎవరికైనా చెప్పారా? అని ప్రశ్నించారు. గోల చేయడం తప్ప ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో చేసిందేమిటని జేసీ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో 'కామ చంద్రబాబు' అంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ సూచించారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ నిర్ణయమని... దాని గురించి తాను మాట్లాడలేనని అన్నారు. రాజకీయాలు స్వచ్ఛంగా లేవని... అనవసరంగా రాద్ధాంతం చేయడం, గొడవ చేయడం తప్ప మరో పని లేదని విపక్షాన్ని జేసీ విమర్శించారు. అసెంబ్లీలో ఆ అరుపులు ఏంటని... మనం మనుషులమా? లేక అడవిలో జంతువులమా? అని మండిపడ్డారు. ఎవరేమి చేయాలనుకున్నా... చంద్రబాబుని ఏమీ చేయలేరని చెప్పారు.