: నెలకు రూ. 5 వేలు దాస్తూ, కోటీశ్వరులుగా మారొచ్చు!


కోటి రూపాయల ఆస్తి... మధ్య తరగతికి తీరని కల... ఓ కోటి సంపాదిస్తే, హాయిగా ఇల్లు కొనుక్కుని కాలిమీద కాలేసుకుని మిగతా జీవితమంతా గడిపేయవచ్చు... ఇది అత్యధిక మధ్యతరగతి ప్రజల్లో ఉండే భావనే. కోటి అనే సంఖ్యను అందుకోవడం చాలా కష్టమైన పని అనుకుంటారు. కానీ, కేవలం నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడుతూ, ఈ మార్గంలో వెళితే, కోటి రూపాయల సంపాదన పెద్ద కష్టమేం కాదని అంటున్నారు నిపుణులు. వృద్ధి చెందే ఆస్తులు..: దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే మార్గాలను ఎంచుకోవాలి. ఈక్విటీలు అందులో మొదటి ఆప్షన్. సాలీనా 12 నుంచి 15 శాతం వరకూ ఈక్విటీల్లో రిటర్న్ వస్తుంది. ఇదే ఫిక్సెడ్ ఇన్వెస్ట్ మెంట్ విధానమైతే సాలీనా 7 నుంచి 8 శాతం మాత్రమే ఆదాయం వస్తుంది. గత పదేళ్లలో భారత మార్కెట్ బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్ ఇచ్చిన రాబడులు 10 శాతానికన్నా ఎక్కువే. 2006 నుంచి 2015 మధ్య ఐదు సంవత్సరాల్లో 15 శాతాన్ని మించిన రాబడిని ఇచ్చింది. సెన్సెక్స్ ఇచ్చిన పదేళ్ల వార్షిక రాబడి (శాతంల) పరిశీలిస్తే, 2006లో 16 శాతం, 2007లో 19 శాతం, 2008లో 12 శాతం, 2009లో 13 శాతం, 2010లో 18 శాతం, 2011లో 17 శాతం, 2012లో 19 శాతం, 2013లో 14 శాతం, 2014లో 15 శాతం, 2015లో (డిసెంబర్ 16 వరకూ) 10 శాతం రాబడి అందింది. ఈ పదేళ్ల సరాసరిగా 15 శాతం రాబడిని లెక్కిస్తే, 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 6,679 ని పొదుపు చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఇక అదే 19 శాతం రాబడి వస్తుందనుకుంటే రూ. 5 వేల కన్నా లోపు పొదుపు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అదే 10 శాతం రాబడి మాత్రమే వస్తుందనుకుంటే నెలకు రూ. 13,168 పెట్టుబడిగా పెడుతూ పోవాలి. దీర్ఘకాలం కొనసాగాలి: లక్ష్యం పెద్దది, పెట్టుబడి చిన్నది. కాబట్టి దీర్ఘకాలం పాటు పట్టు విడువకుండా ముందుకు సాగాలి. నెలకు రూ. 5 వేల చొప్పున పదేళ్లు పెట్టుబడి పెట్టి 15 శాతం రాబడి వస్తే, పదేళ్లు పూర్తయ్యేసరికి మీ దగ్గర రూ. 13.76 లక్షలు సమకూరుతాయి. ఇక అదే మొత్తాన్ని కదిలించకుండా, మరో పదేళ్లు కొనసాగితే మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా? రూ. 74 లక్షలు... అదే కాంపౌండింగ్ పవర్. (అంటే తొలి సంవత్సరం పెట్టిన రూ. 60 వేల పెట్టుబడి మీకు 19 సంవత్సరాల పాటు ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, ప్రతి ఏటా వచ్చే ఆదాయమూ దానికి కలుస్తుంది. ఏడాది తరువాత మీ 15 శాతం రాబడి, సుమారు రూ. 8 వేలనుకుంటే, రెండో సంవత్సరం 68 వేలపై 15 శాతం... ఇలా 18 ఏళ్లు రాబడి అందుతుంది. రెండో సంవత్సరంలో పెట్టిన రూ. 60 వేలు ఇదే పద్ధతిలో 18 ఏళ్ల పాటు రాబడిని అందిస్తుంది) ఇక సరిగ్గా... 15 శాతం రాబడి రాకుండా ఒకటి, రెండు శాతం అటూ ఇటుగా ఉన్నా... నెలకు రూ. 5 వేల పెట్టుబడిని 25 ఏళ్లు పెట్టగలిగితే, కోటి రూపాయలు కళ్ల జూడటం సుసాధ్యమే. అప్పుడే విధుల్లోకి చేరిన వారికి, 30ల్లో ఉన్న మధ్య తరగతి ప్రజలకు అధిక సంపదను సృష్టించే సులువైన మార్గాల్లో ఈక్విటీలు ఒకటని నిపుణులు సూచిస్తున్నారు. (ఈక్విటీల్లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతూ, తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులకు మంచి ఆదాయం వస్తుందని నమ్ముతున్నప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరి)

  • Loading...

More Telugu News