: అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేయనున్న అరుణ్ జైట్లీ!
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేయాలని భావిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో తాను 2013 వరకూ మాత్రమే ఉన్నానని, ఆ తరువాత జరిగిన ఘటనలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానని ఆయన ప్రశ్నించారు. కేజ్రీ సహా ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్ పాయిలపై దావా వేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీ సర్కారు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణకు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గోపాల్ సుబ్రమణియమ్ నేతృత్వం వహిస్తారని కూడా ఢిల్లీ సర్కారు ప్రకటించింది. కాగా, యూపీఏ హయాంలో తీవ్రమైన నేరాల విచారణ అధికారులు ఢిల్లీ క్రికెట్ సంఘంపై విచారణ జరిపి ఎటువంటి అవకతవకలూ జరగలేదని తేల్చిందని జైట్లీ సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేశారు. కేజ్రీవాల్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని అన్నారు. ఇదిలావుండగా, బీజేపీ నేత, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ ఇదే విషయమై మాట్లాడుతూ, క్రికెట్ సంఘంలో భారీ కుంభకోణాలే జరిగాయని, తప్పుడు కంపెనీలను సృష్టించి కోట్లాది రూపాయలను అప్పనంగా ముట్టజెప్పారని ఆరోపించడం చర్చనీయాంశమైంది.