: ఆరోగ్యంగా ఉంటే కోట్లు సంపాదించినట్టే!...110 కి.మీల దూరం సైకిల్ పై సీనియర్ ఐపీఎస్
తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక పోస్టుల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిగా మారారు. నిన్న ఆయన తన ఇద్దరు కొడుకులు ప్రసూన్, ప్రశాంత్ లతో కలిసి 110 కిలో మీటర్ల మేర సైకిల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లాలోని ధారూరు మీదుగా తాండూరు చేరుకున్నారు. అటవీ ప్రాంతం మీదుగా జరిగిన ఈ సైక్లింగ్ లో వయసు మీద పడ్డా రాజీవ్ త్రివేదీ ఎక్కడా ఆగలేదు. తన సుదీర్ఘ సైకిల్ యాత్ర ముగిసిన సందర్భంగా నిన్న ఆయన తాండూరులో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఆదివారం సైక్లింగ్, వాకింగ్, వ్యాయామాలను నిర్విరామంగా కొనసాగిస్తున్న క్రమంలో తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉంటే కోట్లు సంపాదించినట్లేనని కూడా ఆయన తెలిపారు. మాంసం, మద్యం కారణంగా ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని, ఆ రెండింటినీ వదిలేసి నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండే వీలుందని త్రివేదీ చెప్పారు.