: వేడుకగా రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి... హాజరైన గవర్నర్, చంద్రబాబు... వైసీపీ నేతలూ వచ్చారు!
టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి వివాహం నిన్న వేడుకగా జరిగింది. హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్రాకు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన సత్యారెడ్డితో నైమిశ పెళ్లి గతంలోనే కుదిరిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలులో ఉండగానే ఈ వివాహ నిశ్చితార్థం జరిగింది. నాడు కోర్టు అనుమతితో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరయ్యారు. కన్నుల పండువగా జరిగిన నిన్నటి పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్.జైపాల్ రెడ్డి, జానారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఇక వైసీపీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా ఈ వేడుకకు తరలివచ్చారు.