: ‘డిక్టేటర్’ మొదటి పాట ‘గం గం గణేశా...’ లాంచ్
డిక్టేటర్ చిత్రంలోని ‘గం గం గణేశా... ’ అనే మొదటి పాటను వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక సంచలన విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నవ్యాంధ్రలో నందమూరి వారి తొలి సినిమా వేడుక ఇదని, నూతన రాజధానికి ఈ చిత్రంతో శుభారంభమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు అన్నారు. బాలకృష్ణ సినిమాల్లో ముఖ్యంగా రెండు చిత్రాలను తాను మర్చిపోలేనని అన్నారు. 'అన్నదమ్ముల అనుబంధం' చిత్రంలో పాలుగారే వయసులో ఉండే బాలకృష్ణ గిటారు వాయిస్తుండటం, ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధం తనను చాలా ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ చిత్రం వందరోజుల వేడుకను ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించాలంటూ బాలకృష్ణను శ్రవణ్ కుమార్ కోరారు.