: డ్రంకెన్ డ్రైవ్ లో యువతి హల్ చల్... ఆ వైనాన్ని మీరూ చూడండి!
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, ప్రతి వారమూ పదుల సంఖ్యలో మందుబాబులు, వారిలో ఒకరిద్దరు యువతులు పట్టుబడుతూనే ఉన్నారు. నిన్న హైదరాబాద్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న వేళ, కురచ దుస్తులు ధరించి కారులో వచ్చిన యువతి హల్ చల్ చేసింది. మద్యం సేవించి కారు నడుపుతున్న ఆమెను పోలీసులు పరీక్షించబోగా తొలుత సహకరించ లేదు. ఆపై అతి కష్టం మీద పోలీసులు పరీక్షలు నిర్వహించి, మోతాదుకు మించిన మద్యం సేవించినట్టు తేల్చి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. టీఎస్ 09 ఈఏ 7848 నంబరుపై వస్తున్న యువకులు, పోలీసులను చూసి తమ బైకును వేగంగా వెనక్కు తిప్పి వెళుతూ డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ డ్రైవ్ లో 11 కార్లు, 3 బైకులు సీజ్ చేసి 14 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.