: వెయిటర్ నిజాయతీ... లక్షలు దొరికినా తిరిగిచ్చేసి, చిన్న 'టిప్' కూడా తీసుకోలేదు!


సాధారణంగా ఎక్కడైనా పది రూపాయలు దొరికితేనే నెమ్మదిగా జేబులో పెట్టేసుకునే రోజులివి...అలాంటిది లక్షల రూపాయల డబ్బులు కనిపిస్తే ఎవరైనా వదులుకుంటారా? అలా వదిలేసుకుని తాను కూటికి పేదవాడినే కానీ, వ్యక్తిత్వానికి కాదని నిరూపించాడో వెయిటర్. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో కాలిఫోర్నియాలోని ఫ్రెన్సోలోని యాపిల్ బీ రెస్టారెంట్ లో ఓ కుటుంబం భోజనం చేసి వెళ్లింది. అనంతరం ఆ టేబుల్ దగ్గరకు వెళ్లిన వెయిటర్ ఆ కుటుంబం మర్చిపోయిన పర్సును గుర్తించాడు. అందులో నోట్ల కట్టలు ఉండడం కూడా గుర్తించాడు. దీంతో ఆ పర్సును రెస్టారెంట్ మేనేజర్ కు అప్పగించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, పోలీసులు వచ్చి ఆ పర్సును స్వాధీనం చేసుకున్నారు. దానిని తెరచి చూసి వారు షాక్ తిన్నారు. అందులో 32 వేల డాలర్లు ఉన్నాయి. అంటే భారత కరెన్సీలో 21 లక్షల 22 వేల రూపాయలు. ఇంతలో మరో పోలీస్ స్టేషన్ లో ఆ కుటుంబం తమ నగదు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని పిలిపించి, వెయిటర్ చేసిన గొప్ప పని గురించి వివరించి, ఆ నగదును వారికి అందజేశారు. ఒక్క రూపాయి కూడా పోకుండా తమకు దొరకడంతో, ఆ కుటుంబ సభ్యులు రెస్టారెంట్ కు వెళ్లి వెయిటర్ ను కలుసుకుని కృతజ్ఞతగా కొంత నగదు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఏదో ఆశించి తానాపని చేయలేదని, వేరేవారి డబ్బు తీసుకోవడం సరికాదనే తీసుకోలేదని, తనకు నజరానా వద్దని సున్నితంగా తిరస్కరించాడు. అతని గొప్పతనానికి పోలీసులు, ఆ కుటుంబం ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News