: కోర్టు మెట్లెక్కిన సోనియా, రాహుల్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తొలిసారి కోర్టు మెట్లెక్కారు. తన కుమారుడు రాహుల్ గాంధీతో కలసి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. అంతకుముందే, ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రా కోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో సహనిందితులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ లు కూడా కోర్టుకు చేరుకున్నారు. మరోవైపు పిటిషన్ వేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి భారీ భద్రతను కల్పించారు. మరోవైపు కోర్టు వద్ద వందలాది మంది పోలీసులు, ప్రత్యేక భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.