: కరణం బలరాం ఎలా సస్పెండ్ అయ్యారో సభలో వివరించిన జగన్
వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారంపై ఏపీ శాసనసభ అట్టుడుకుతోంది. ఓ వైపు అధికారపక్షం పలు బిల్లులను సభలో ప్రవేశపెడుతుంటే... మరోవైపు, వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ, సభను అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ అభ్యర్థి కరణం బాలరాం ఎలా సస్పెండ్ అయ్యారో సభకు వివరించారు. కరణం బలరాం సస్పెండ్ అయిన ఘటనకు సంబంధించిన వివరాలను తాను కనుక్కున్నానని చెప్పారు. అభ్యంతరకర వ్యాఖ్యలను బలరాం చేసిన తర్వాత, అతనికి ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారని... అయినప్పటికీ అతను హాజరు కాకపోవడంతో సస్పెండ్ చేశారని తెలిపారు. కానీ, ఇలాంటి ప్రొసిజర్ ఏమీ లేకుండానే రోజాను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. దీనికి సమాధానంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ, బయట ఎక్కడైనా, ఎవరైనా మాట్లాడితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎథిక్స్ కమిటీ ముందుకు రావాలని కోరుతారని... కానీ రోజా వ్యవహారం మొత్తం సభలోనే, అందరి ముందే జరిగిందని... కాబట్టి, ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేయవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు.