: బుద్ధా వెంకన్న సోదరుడి బెయిల్ పిటిషన్ ను రిటర్న్ చేసిన జడ్జీ... స్టేషన్ బెయిల్ ఇచ్చేసిన పోలీసులు
కాల్ మనీ కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో వెలుగుచూసిన ఈ దందా, రాష్ట్రవ్యాప్తంగానూ జరుగుతోందని తాజా పోలీసు దాడులు తేల్చిచెబుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెడుతూ విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావుకు ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఈ మేరకు నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ అరెస్టులో నిన్న ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితమే బుద్ధా నాగేశ్వరరావు అరెస్ట్ కాగా, నిన్న విజయవాడ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు ససేమిరా అన్న న్యాయమూర్తి, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసులకు సంబంధించి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తే సరిపోతుంది కదా? అంటూ సదరు పిటిషన్ ను రిటర్న్ చేశారు. దీంతో పోలీసులు బుద్ధా నాగేశ్వరరావుకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.