: ఆ బాల నేరస్థుడిని అవార్డుతో సత్కరించండి !: 'నిర్భయ' తండ్రి
ఢిల్లీలో బస్సులో వెళుతున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన దారుణ సంఘటన జరిగి మూడేళ్లు దాటింది. ఈ కేసులో బాల నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్న అతని శిక్షాకాలం ముగియనుండటంతో త్వరలో విడుదల కానున్నాడు. అయితే, అతన్ని విడుదల చేయవద్దంటూ ‘నిర్భయ’ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా కోర్టు తిరస్కరించింది. అతని విడుదలను తాము అడ్డుకోలేమంటూ, స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్ (నిర్భయ) తండ్రి బద్రినాథ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు... * ‘నిర్భయ’ బాలనేరస్తుడు త్వరలో విడుదల కానుండంటంపై మీ అభిప్రాయం? మన దేశంలో బాల నేరస్తులకు ఎటువంటి చట్టం లేదన్న విషయాన్ని నేను నమ్ముతాను. చాలా మంది బాల నేరస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. బాల నేరస్తులపై కఠినతరమైన చట్టాలను ఇంతవరకు మనదేశంలో తీసుకురాలేకపోయాం. ‘నిర్భయ’ కేసులో దోషి విడుదల కానున్నాడన్న వార్తతో ఢిల్లీ ప్రజలకు నిద్రపట్టట్లేదు. క్షేమంగా ఉండగలమా? అనే భయంతో వారు వణికిపోతున్నారు. ఈ బాల నేరస్తుడు ప్రస్తుతం సెలబ్రిటీకి ఏమాత్రం తక్కువకాదు. అతను తప్పేమి చేయలేదు. ప్రభుత్వం అతన్ని సత్కరించాలని నేను భావిస్తున్నాను (వ్యంగ్యంగా,కోపంగా). ఆప్ అధినేత కేజ్రీవాల్ ను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు, షీలా దీక్షిత్ ప్రభుత్వం హయాంలో మహిళలపై జరిగిన నేరాలను అదుపు చేయలేకపోయారని విమర్శించారు. మరి, మీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న నేరాలు మరింత దారుణంగా ఉన్నాయి. ఢిల్లీలో మహిళలకే కాదు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. * ‘నిర్భయ’ వంటి కేసుల్లో న్యాయం జరగడానికి చాలా ఆలస్యం జరుగుతుండటంపై మీ అభిప్రాయం? సెల్రబిటీ లేదా రాజకీయ నాయకుడి వంటి వారికైతే వెంటనే న్యాయం జరుగుతోంది. నేను పేదవాడిని కనుక ఈ కేసులో న్యాయం జరగడం ఆలస్యమవుతోంది. కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఎవరికైనా న్యాయం జరిగిందా? ‘నిర్భయ’ కేసు విషయానికొస్తే.. రెండు, మూడు జనరేషన్ల తర్వాత మాకు న్యాయం జరగవచ్చనుకుంటున్నాను. న్యాయం కోసం ప్రభుత్వంపై పోరాడతాను. * భారత్ లో మహిళల పట్ల, మహిళల పై నేరాలు చేసిన వారిపై మన దేశం వైఖరి గురించి.. అతినీతిపరులను, నిందితులను ఏ ప్రభుత్వం శిక్షించలేదు. హత్యలు చేసిన వారికి, అత్యాచారాలు చేసిన వారికి అన్ని ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. వారిని కాపాడుతూనే ఉన్నారు. అందుకనే, మహిళలు తమకు రక్షణ ఉన్నట్లు భావించట్లేదు. మహిళల రక్షణ చట్టాల్లో మార్పులు రావాలి. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. * ‘మహిళలకు రక్షణ’ అనేది కేవలం నినాదం మాత్రమేనా? అవును. ‘మహిళల రక్షణ’ అనే అంశంపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే, ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. రాజకీయ నేతలు తప్పుడు హామీలు, వాగ్దానాలివ్వడం తప్పా ఒరగబెడుతున్నదేమీ లేదు. బీజేపీ, ఆప్.. ఆ రెండు పార్టీలు కూడా అంతే. * ‘నిర్భయ’ ఘటన తర్వాత మీ జీవితం గురించి.. ప్రాణాలున్న ఒక మృతదేహంలా బతుకుతున్నాను. తిండి తినలేం.. నిద్ర పోలేం.