: తిరిగొచ్చిన ఫెడ్ భయం... వరల్డ్ మార్కెట్ క్రాష్!
అమెరికాలో పరపతి విధానాన్ని కఠినం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి నిన్న స్పందించని భారత మార్కెట్, నేడు వరల్డ్ మార్కెట్ల తీరుతో తలొగ్గాల్సి వచ్చింది. దాదాపు అన్ని ఆసియా మార్కెట్లూ నష్టాల్లో ఉండటం, ఆపై యూరప్ దేశాల సూచికల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా, ఆందోళనకు గురైన విదేశీ ఇన్వెస్టర్లు, తమ వాటాలను వెనక్కు తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో లార్జ్ కాప్ సూచిక భారీగా నష్టపోయింది. మిడ్ కాప్ సెక్టార్ కంపెనీలు లాభాల్లో నడవగా, స్మాల్ కాప్, సెన్సెక్స్ కంపెనీలు ఒత్తిడిలో పడ్డాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 284.56 పాయింట్లు పడిపోయి 1.10 శాతం నష్టంతో 25,519.22 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 82.40 పాయింట్లు పడిపోయి 1.05 శాతం నష్టంతో 7,761.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభాలను, స్మాల్ క్యాప్ 0.24 శాతం నష్టాలనూ నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ-50లో 10 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. అదానీ పోర్ట్స్, ఐడియా, పవర్ గ్రిడ్, ఆసియన్ పెయింట్స్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, అల్ట్రా సిమెంట్ కంపెనీ, బజాజ్ ఆటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. గురువారం నాడు రూ.97,53,746 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 97,83,057 కోట్లకు పెరిగింది. మొత్తం 2,904 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,300 కంపెనీలు లాభాలను, 1,400 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. కాగా, శుక్రవారం నాడు ఆసియా మార్కెట్లన్నీ ఒకటి నుంచి రెండు శాతం నష్టపోగా, కడపటి వార్తలు అందేసరికి యూరప్ మార్కెట్లు అర శాతం వరకూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.