: నా 34 ఏళ్ల జీవితంలో ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎన్నడూ చూడలేదు: యనమల
ఏపీ శాసనసభలో కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి యనమల రామకృష్ణుడు సభలో చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడం ముగియకుండానే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగారి ప్రకటన చేశాకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలని చెప్పారు. ఇవన్నీ తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టుగా గొడవ చేస్తున్నారన్నారు. ఆ పార్టీ అధినేత ఒత్తిడి తట్టుకోలేకే పాపం ఆ ఎమ్మెల్యేలు కూడా అలా చేస్తున్నారని, వారినొకసారి చూస్తే మొహాల్లో కూడా ఏమాత్రం కళలేదన్న విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అసలు ఇలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు ఆయా నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారని విమర్శించారు. ఇక తన 34 ఏళ్ల జీవితంలో ఇలాంటి ప్రతిపక్ష నేతను (జగన్) ఎప్పుడూ చూడలేదని యనమల పేర్కొన్నారు.