: చేతనైతే తిరుపతి, సింహాచలం కొండలు తవ్వండి!: స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
‘చేతనైతే తిరుపతి, సింహాచలం కొండలను తవ్వండి చూద్దాం’ అంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై శ్రీ శారదాపీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. ఆ కొండలను తవ్వితే భక్తులు ఊరుకుంటారా? అంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖపట్టణం జిల్లా మంచంగిపుట్టు, పెద్దబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర ఈరోజు పర్యటించారు. అక్కడి గిరిజనులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో స్వామీజీ మాట్లాడుతూ, విశాఖపట్నం జిల్లా అరకులో బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని వారి సంపదను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని.. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. ఇక్కడి కొండలపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నడయాడారని అన్నారు. హనుమంతుడు కూడా ఒక గిరిజనుడేనన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలపై పోరాడాలని, విదేశీ మూకలను తరిమికొట్టాలని గిరిజనులకు ఆయన పిలుపు నిచ్చారు.