: సామ్రాట్ అశోకుని జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించిన బీహార్!
మౌర్య చక్రవర్తి, అవిభాజ్య హిందూ సామ్రాజ్యాధినేత సామ్రాట్ అశోకుడి జన్మదినం ఏప్రిల్ 14 అని బీహార్ ప్రభుత్వం గుర్తించింది. అశోకుడు జన్మించి 2,320 సంవత్సరాలు గడిచిందని వెల్లడించిన బీహార్ సర్కారు, ఏప్రిల్ 14ను రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని భావిస్తోంది. బీహారులో మహాకూటమి విజయం అనంతరం అశోకుని వారసులుగా భావించే కుష్వాహులను తిరిగి తమవైపునకు తిప్పుకునే క్రమంలో నితీశ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పూర్తి చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ, కుష్వాహుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు, అందుబాటులోని ఆధారాలతో సామ్రాట్ అశోకుని జన్మదినాన్ని ప్రకటించినట్టు జనతాదళ్ (యూ) ప్రతినిధి అజయ్ అలోక్ వెల్లడించారు. కాగా, రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆర్ అంబేద్కర్ జన్మదినం కూడా ఇదే కావడం గమనార్హం. నితీశ్ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని, అశోకుని జన్మదినంపై ఆయనకు ఎవరు సలహా ఇచ్చారో తెలియడం లేదని, పురాతత్వ శాస్త్రవేత్త డీఎన్ ఝా వ్యాఖ్యానించారు.