: ‘ఆడీ’పై మోజు అడ్డదారి తొక్కించింది!
ఆడీ కారులో తిరగాలన్న బలమైన కోరికతో ఓ యువకుడు తన యజమాని కారునే దొంగిలించి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని సయ్యద్ నగర్ లో జరిగింది. ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీషు సంస్థ రస్సెల్స్ అధినేత రస్సెల్స్ జహీర్ వద్ద ఎండి నజీర్(28) అనే యువకుడు రెండు నెలల క్రితం కారు డ్రైవర్ గా చేరాడు. పనుల నిమిత్తం యజమానితో పాటు వెళ్తుండేవాడు. గత నెల 12వ తేదీన ఉన్నపళంగా కారుతో పాటు నజీర్ మాయమయ్యాడు. దీంతో సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని పార్కింగ్ స్థలంలో కారు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. నజీర్ ముంబయికి పరారైనట్లు వారి దర్యాప్తులో తేలింది. నిందితుడి కోసం వలపన్నిన పోలీసులు ఎట్టకేలకు ఈ రోజున నజీర్ ను పట్టుకున్నారు. విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆడి కారులో తిరగాలనే సరదా ఉండేదని, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రాత్రి సమయాల్లో షికార్లు కొట్టాలన్న కోరిక ఉండటంతో ఈ కారును ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. తర్వాత రెండు రోజుల పాటు అర్ధ రాత్రుళ్లు ఎయిర్ పోర్టు వరకూ షికార్లు కొట్టానని చెప్పాడు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారిని ఎక్కించుకెళ్లడం ద్వారా డీజిల్ ఖర్చులు సంపాదించానని తెలిపాడు. ఈ డబ్బులు సరిపోక పోవడంతో కారును వదిలేసినట్లు చెప్పాడు.