: రష్యా ఆర్థికాభివృద్ధి నిరాశాజనకంగా ఉంది: పుతిన్
తమ దేశ ఆర్థికాభివృద్ధి నిరాశాజనకంగా ఉందని ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. వార్షిక న్యూస్ కాన్ఫరెన్స్ లో భాగంగా మాస్కోలో పుతిన్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయిందని అన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థ ఆయిల్, గ్యాస్ పై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు ఉండి ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ధర ప్రస్తుతం 50 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన చెప్పారు. అయితే వ్యవసాయ, ఉత్పత్తి రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.