: చంద్రబాబు... కాల్ బాబు, మనీ బాబు, సెక్స్ రాకెట్ బాబు: వైఎస్ జగన్ ఆరోపణలు
ఆడవాళ్ల జీవితాలతో టీడీపీ నేతలు చెలగాటం ఆడారని, వారి వీడియోలు తీశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవడం.. సభ రేపటికి వాయిదా పడటం తెలిసిందే. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటనపై ప్రశ్నించిన తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. సెక్స్ రాకెట్ ముఠాకు సంబంధించిన ఆధారాలున్నాయని అన్నారు. చంద్రబాబుతో, ఇంటిలిజెన్స్ డీజీతో ఆ నిందితులు కలిసి ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. ఆ వీడియోలు తీసిన టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఒక్కరోజూ కూడా పాలించే అర్హత ఆయనకు లేదంటూ మండిపడ్డారు. చంద్రబాబును... కాల్ బాబు, మనీ బాబు, సెక్స్ రాకెట్ బాబు అని అనవచ్చంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఉన్నపళంగా అంబేద్కర్ గుర్తుకొచ్చారని.. ఆయన్ని కూడా రాజకీయ అవసరాలకు చంద్రబాబు వాడుకుంటున్నారని, ఇటువంటి వ్యక్తిని తానెన్నడూ చూడలేదంటూ విమర్శించారు.