: విమానం ఇంజన్ లో ఇరుక్కుని ఎయిరిండియా ఉద్యోగి మృతి
ముంబైలోని ఛత్రపతి శివాజీ డొమెస్టిక్ విమానాశ్రయంలో ఎయిరిండియా ఉద్యోగి ఒకరు చనిపోయారు. విమానాశ్రయంలోని 28వ బే వద్ద పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్ లో ఇరుక్కోవడంతో అతను మరణించాడు. ముంబై నుంచి హైదరాబాద్ కు మరికొద్దిసేపట్లో వెళ్లాల్సిన విమానంలో కో-పైలెట్ ఒకరు సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేశారు. దాంతో అప్పటికే దాని వద్ద ఉన్న రవి సుబ్రమణియన్ అనే గ్రౌండ్ క్రూ సభ్యుడిని ఇంజన్ ఫ్యాన్లు లోపలికి లాగేసుకున్నాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. ఈ ఘటన నిన్న(బుధవారం) రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ, విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల తాము దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. దానిపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. సాధారణంగా విమానం ఇంజన్లు ఆఫ్ చేసి ఉన్నప్పుడే విమాన సిబ్బంది వాటి నిర్వహణ పనులు చూస్తుంటారు. కానీ ఇక్కడ ఇంజన్ వద్ద వ్యక్తి ఉన్నది, లేనిది కోపైలెట్ కు తెలియదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.