: కాల్ మనీ వ్యవహారంపై పూర్తి స్థాయి ఉద్యమం: వైఎస్ జగన్ ప్రకటన


కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ పూర్తి స్థాయి ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో రవీంద్ర భారతి సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారంపై తాము పూర్తి స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. కాల్ మనీ దందాలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు డబ్బు కూడా ఉందని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే విదేశీ పర్యటనకు వెళ్లారని, ఈ దందా వెలుగుచూసిన తర్వాత చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే ఒంటరిగా స్వదేశానికి తిరిగి రాగా, కీలక నిందితుడు మాత్రం విదేశాల్లోనే ఉండిపోయాడని ఆరోపించారు. పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ తర్వాతనే సదరు ఎమ్మెల్యేను తిరిగి రావాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. తమ వద్ద అప్పులు తీసుకున్న మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డ కాల్ మనీ నిర్వాహకులు వారిని అశ్లీలంగా చిత్రీకరించి వేధింపులకు పాల్పడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News