: దుస్తులు విప్పించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు!... ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, నలుగురు అరెస్ట్
ఉస్మానియా మెడికల్ కళాశాల... తెలుగు రాష్ట్రాల్లోనే కాక యావత్తు భారతావనిలో వైద్య విద్యకు సంబంధించి పేరెన్నికగన్న కళాశాల. విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్న వైద్యులను తయారుచేస్తున్న ఈ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోమారు పురి విప్పింది. తమకు మర్యాద ఇవ్వడం లేదన్న కారణం చూపి సీనియర్లు జూనియర్ విద్యార్థులపై ప్రతాపం చూపారు. దుస్తులు విప్పించి మోకాళ్లపై నేల మీద కూర్చోబెట్టి జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. రాత్రి వేళ హాస్టల్ లోని తమ గదులకు జూనియర్లను పిలిపించిన సీనియర్లు దాదాపు రెండు గంటల పాటు ఈ వికృత క్రీడ కొనసాగించారు. విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారు. ఈ నెల 9న చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బాధిత విద్యార్థుల్లో కొందరు నోరు మెదిపేందుకు భయపడ్డా, వారిలోని కొందరు నిన్న సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ర్యాగింగ్ కు పాల్పడ్డ నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు. మరోమారు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఇక ఈ వికృత క్రీడలో ఇంకెంత మంది సీనియర్లు పాలుపంచుకున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.